విప్లవోద్యమమా… విరమణనా..? మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు

దిశ దశ, దండకారణ్యం:

సాయుధ పోరాటంతోనే ముందుకు సాగాలా? ఆయుధాలు వదిలేయాలా? అన్న విషయంపై మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయుధ విరమణ అంశంపై అభయ్ మాత్రమే తన వైఖరిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా నార్త్ బస్తర్, గడ్చిరోలి ప్రాంత కమిటీలు విడుదల చేసిన ప్రకటనలు మావోయిస్టు పార్టీ నాయకత్వంలో నెలకొన్న అభిప్రాయ బేధాలను తేటతెల్లం చేస్తున్నాయి.

అభయ్ Vs జగన్…

ఆపరేషన్ “కగార్”తో దండకారణ్య జోన్ లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్ కౌంటర్లు కేంద్ర కమిటీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సుధీర్ఘ కాలంగా అజ్ఞాతంలో ఉన్న ముఖ్య నాయకులు మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయుధ విరమణ అంశం గురించి చర్చకు వచ్చిందని తెలుస్తోంది. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ కు ముందు కూడా ఈ విషయంపై చర్చ జరిగినట్టుగా అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయుధాల తాత్కాలిక విరమణకే మొగ్గు చూపినట్టుగా వెల్లడించారు. అయితే మొదట అభయ్ విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర కమిటీ చర్చ గురించి ప్రస్తావించకుండా తాత్కాలిక ఆయుధ విరమణకు అనుకూలంగా ఉన్నట్టుగా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అభయ్ ప్రకటన ఆయన వ్యక్తిగతమన్నారు. బహిరంగ ప్రకటన చేయడం సరికాదని, అంతర్గతంగా చర్చించాల్సిన విషయాన్ని ఓపెన్ గా చెప్పడాన్ని జగన్ తప్పు పట్టారు. ఇందుకు కౌంటర్ గా అభయ్ కూడా ఘాటుగానే స్పందించారు. కేంద్ర కమిటీ చర్చతో పాటు పార్టీ డాక్యూమెంట్లను జగన్ చదవాలన్నారు. తాను చేసింది కేంద్ర కమిటీ అభిప్రాయమేనని అభయ్ స్పష్టం చేశారు.

తాజాగా…

తాజాగా విడుదల అయిన మరో రెండు లేఖలు సరికొత్త చర్చకు దారి తీశాయి. నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ ప్రతినిధి సుఖ్ దేవ్ కౌడో ఆయుధ విరమణ నిర్ణయాన్ని స్వాగతించారు. సోనూదాదా అలియాస్ అభయ్ కి మద్దతుగా నిలవాలని కోరారు. నంబళ్ల కేశవరావు చేసిన శాంతి చర్చల ప్రతిపాదనకు రూపేష్ కూడా మద్దతిచ్చారని వెల్లడించారు. నిర్భందం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఉద్యామాన్ని వదిలి వెల్లిపోతున్న తీరు కూడా ఆందోళన కల్గిస్తోందని గడ్చిరోలి డివిజన్ కమిటీ ప్రతినిధి కలంసాయి వేలడి, 10 కంపెనీ కమాండర్ నిఖిల్, సాంకేతిక విభాగం ఇంఛార్జి మేనులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఆశించిన రీతిలో విప్లవోద్యమం ఉదృతి పెంచుకోలేకపోతున్నామని, ప్రతికూల పరిస్థితుల్లో బలహీనపడుతున్న ఈ సమయంలో ఆయుధ విరమణ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు తమ నిర్ణయానికి సానుకూలతను వ్యక్తం చేయాలని కోరారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయామని, 20 మంది వరకు రాష్ట్ర కమిటీ బాధ్యులను కూడా కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలిక ఆయుధ విరమణకు సుముఖంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం.

చీలికనా… లోంగుబాటా..?

అభయ్ ప్రకటనకు అనుగుణంగా ఉత్తర బస్తర్, గడ్చిరోలి డివిజన్ కమిటీలు కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో మావోయిస్టు పార్టీ ఉద్యమం ఎటువైపు వెలుతుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అభయ్, ఆశన్నతో పాటు భారీ ఎత్తున పార్టీ నాయకులు జనజీవనంలో కలిస్తున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జగన్ తో పాటు బడే దామోదర్, కంకణాల రాజిరెడ్డి వంటి నాయకులు మాత్రం సాయుధ పోరుతోనే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేఫథ్యంలో కేంద్ర కమిటీలో అత్యంత సీనియర్ నాయకులు అయిన అభయ్, ఆశన్నల నేతృత్వంలో బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతారా లేక మరో పంథా మార్చుకుని వేరు కుంపటి పెడతారా అన్న విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు.

భారీ కుదుపు…

చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్య అటవీ ప్రాంతంలో తాజాగా నెలకొన్న పరిణామాలు మావోయిస్టు పార్టీలో భారీ కుదుపు మొదలైందన్న చర్చ సాగుతోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా క్రాంతి కారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ నిర్భందం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుండగా పార్టీ కీలక నాయకుల్లో కూడా అభిప్రాయబేధాలు పొడసూపడం విప్లవోద్యమంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ప్రంటల్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు కూడా ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే హక్కుల సంఘాలపై కూడా సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు వైరల్ అవుతుండడం గమనార్హం.

abhay @ sonu dadabastarchhattisgarhDANDKARNYAMmaoist