కర్రెగుట్టల తరహాలో మరో ఆపరేషన్?
దిశ దశ,, దండకారణ్యం:
చత్తీస్ గడ్ కీకారణ్యాలను వేలాది సంఖ్యలో బలగాలు చుట్టుముట్టాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని బలగాలు స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది.
కర్రెగుట్టల తరహాలో?
తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలపై మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న షెల్టర్ లను కొల్లగొట్టినట్టుగానే నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఏరియాను కార్డెన్ చేసినట్టుగా సమాచారం. దాదాపు 20 వేల మంది వరకూ బలగాలు ఈ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. కర్రెగుట్టలపై 21 రోజుల పాటు భారీ ఆపరేషన్ చేసిన బలగాలు ఆయుధాలను, డంప్ లను ట్రేస్ చేశాయి. ఈ ఘటనలో భారీ సంఖ్యలో మావోయిస్టులు కూడా చనిపోయారు. కర్రెగుట్టలను క్లీన్ చేశామని, మావోయిస్టుల డెన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో సేఫ్ జోన్ లోకి వెళ్లిన నక్సల్స్ కోసం బలగాలు సెర్చింగ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అగ్రనేత నంబళ్ళ కేశవరావు ఎన్ కౌంటర్ లో మరణించారు. ఇప్పటికీ ఈ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టు ముఖ్య నాయకులు ఇదే ప్రాంతంలో షెల్టర్ తీసుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు పోలీసు అధికారులు. నేషనల్ పార్క్ అడవులను కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే మావోయిస్టుల ఏరివేత పూర్తి అవుతుందని భావిస్తున్నారు. చత్తీస్ గడ్ లోని ఇంద్రావతి నది తీరం, బందిపారా, మద్దేడ్, సండ్ర, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ తాలుకా కమలాపురం పరిసల ప్రాంతాలను బలగాలు చుట్టుముట్టినట్టుగా సమాచారం.
నాకాబందీ…
వేలాది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ అటవీ ప్రాంతాన్ని బలగాలు దిగ్భందిచాయి. అడవుల్లో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టు నాయకత్వానికి, బాహ్య ప్రపంచానికి సంబంధాలను ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో భాగంగానే ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
టార్గెట్ హిడ్మా?
మావోయిస్టు మిలటరీ ప్లాటూన్స్ ఇంఛార్జి, కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాతో పాటు మరికొంతమంది కీలక నేతలే లక్ష్యంగా బలగాలు మోహరించినట్టుగా తెలుస్తోంది. హిడ్మాను కట్టడి చేసినట్టయితే దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోతోందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయన కారణంగానే ఆదివాసీ యువత పార్టీకి ఆకర్షితులు అవుతున్నారని కూడా గుర్తించినట్టు సమాచారం.
ఆందోళన…
నేషనల్ పార్క్ ఫారెస్ట్ లో జరుగుతున్న బలగాల మోహరింపుపై పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాంతి చర్చల కమిటీ ప్రతినిధి, ప్రొఫెసర్ హరగోపాల్ ఓ ప్రకటనలో దండకారణ్యంలో జరుగుతున్న ఏరివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రనేతలు గణపతి, హిడ్మాలు అక్కడ ఉన్నారని వారిని ఏరీవేసేందుకు కాల్పులు జరపడం సమంజసం కాదన్నారు. పౌరహక్కుల నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.