పరువు హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు…
పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి…
దిశ దశ, హుజురాబాద్:
డిసెంబర్ 15 2025 సైదాపూర్ పోలీస్ స్టేషన్ కు ఓ ఫిర్యాదు వచ్చింది. థైరాయిడ్, కడుపు నొప్పి కారణంగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆ కంప్లైంట్ లోని సారాంశం. ఫిర్యాదు అందుకున్న తరువాత ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులకు ఎక్కడో డౌటనుమానం మొదలైంది. నెమ్మదిగా కూపీ లాగడం మొదలు పెట్టారు. ఒక్కో విషయాన్ని బయటకు తీశారు… చివరకు తల్లిదండ్రులే కన్న బిడ్డను దారుణంగా హత్య చేశారని తేల్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ పరువు హత్య కేసుకు సంబంధించి వివరాలను హుజురాబాద్ ఏసీపీ వి మాధవి మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఫిర్యాదు ఇలా…
సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట అనుబంధ గ్రామమైన శివరాంపల్లికి చెందిన రెడ్డి అర్చన (16) ఆత్మహత్య చేసుకుని మరణించిందని, ఆమెకు కడుపు నొప్పి, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని తండ్రి రెడ్డి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అర్చన డిసెంబర్ 14న తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తరువాత నిద్రపోయిందని పేర్కొన్నాడు. తెల్లవారు జామున 4 గంటలకు లేచి చూసే సరికి అర్చన స్పందించకపోవడంతో ఆమెను పరిశీలించగా నోటి నుండి నురుగు కనిపించడంతో మరణించిందని నిర్దారించుకున్నారు. అనారోగ్యం కారణంగా విష పదార్థం తీసుకోవడం వల్ల మరణించి ఉంటుందని రాజు ఆ ఫిర్యాదులో వివరించాడు దీంతో సైదాపూర్ పోలీసులు క్రైం నంబర్ 182/2025, 194 BNSS యాక్టులో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దారుణంగా చంపేసి…
అయితే అర్చన మృతి తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు కూపీ లాగడం ప్రారంభించారు. ఒక్కో విషయం వెలుగులోకి వస్తుండడంతో తమ అనుమానం నిజమేనని అర్చనది ఆత్మహత్య కాదని, హత్యేనని నిర్దారించుకున్నారు. దీంతో ఒక్కో విషయంపై ఆరా తీసిన పోలీసులు అసలు గుట్టును బట్టబయలు చేశారు. ఇదే గ్రామానికి చెందిన పోలు అనీల్ (27) అమ్మాయిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న విషయం గురించి కుటుంబంలో గొడవలు జరుగుతుండేవని పోలీసుల విచారణలో తేలింది. తమ కుటుంబం పరువు పోతుందని భావించిన అర్చన తల్లిదండ్రులు రెడ్డి రాజు (45), రెడ్డి లావణ్య (40)లు ప్రణాలిక ప్రకారం ఆమెను చంపేశారని తేల్చారు. డిసెంబర్ 14వ తేది రాత్రి అర్చన నిద్రిస్తున్న విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించారు. అయినా అర్చన చనిపోకపోవడంతో తండ్రి రాజు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో నిందితులను విచారించగా పరువు పోతుందన్న కారణంతో తామే తమ బిడ్డను చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో ఆత్మహత్య కేసును హత్య కేసుగా మార్చి నిందితులైన రాజు, లావణ్యలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఏసీపీ మాధవి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ రూరల్ సీఐ పి వెంకటి, సైదాపూర్ ఎస్సై సిహెచ్ తిరుపతిలు పాల్గొన్నారు.