కరీంనగర్ లో పావులు కదుపుతున్న కాంగ్రెస్
జగిత్యాల ఇంచార్జీలుగా సచిన్, లక్ష్మణ్ లు…
దిశ దశ, కరీంనగర్:
పరిపూర్ణమైన మెజార్టీ సాధించని పురపాలక సంఘాల్లో అదికారం ‘‘చే’’జిక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇతర పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టుకొని అయినా సరే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్ విషయంలో సక్సెస్ అయినట్టుగానే మిగతా మునిసిపాలిటీల్లో పట్టు బిగించాలని నిర్ణయించుకుంది. శనివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
జగిత్యాల బాధ్యతలు…
జగిత్యాల, రాయికల్ మునిసిపాలిటీల బాధ్యతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. జగిత్యాల మునిసిపాలిటీలోన 50 వార్డులకు గాను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గంలో 17, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి వర్గంలో 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా క్యాంపులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఈ రెండు క్యాంపుల్లోని కౌన్సిలర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయని పీసీసీ పెద్దలు అంచనా వేస్తున్నారు. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ లతో చర్చించి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల నాయకుల డిమాండ్ల గురించి సమగ్రంగా చర్చించి వారికి అవసరమైన అండదండలు అందించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఓ వర్గానికి ఛైర్మన్ పీఠం, మరో వర్గానికి వైస్ ఛైర్మన్ పదవిని అప్పగించే విషయంపై కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే జీవన్ రెడ్డి మాత్రం మొదటి నుండి పార్టీ జెండా పట్టుకున్న వారికే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను ఒప్పించినట్టయితే జగిత్యాలలో దాదాపుగా సమస్యకు పరిష్కారం లభించినట్టు అవుతుందని భావిస్తున్నారు. రాయికల్ మునిసిపాలిటీలో 12 వార్డలుకు గాను ఐదు బీజేపీ, మూడు చొప్పున కాంగ్రెస్, బీఆర్ఎస్, ఒక ఇండిపెండెంట్ గెల్చుకున్నారు. ఇక్కడ కూడా సమాలోచనలు జరిపి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.
బంపర్ ఆఫర్లు..?
ఇకపోతే తెలంగాణలో మరో హాట్ సీట్ అయిన కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ దృష్టి సారించింది. ఎన్నికల ఫలితాల తరువాత ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో అధికారం చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దాదాపు 32 మందితో క్యాంపు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పదవి కాలం ముగిసే వరకు డివిజన్ల అభివృద్ది కోసం నిదుల వరద పారించడంతో పాటు ఇతరాత్ర అంశాల్లోనూ వారికి చేదోడుగా నిలిచేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న హామీ ఇస్తున్నట్టుగా సమాచారం. బీజేపీ క్యాంపులో 34 మంది కార్పొరేటర్లు ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఎంపీగా ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కుతో ఆ సంఖ్య 35కు చేరనుంది. అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తాజాగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల విషయంలో క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫీషియో ఓట్లు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరిద్దరు స్వతంత్రులను ఆకట్టుకున్నా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకత్వంతో మాట్లాడి అనుకూలంగా మల్చుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ కారణంగానే కార్పొరేటర్లను శిబిరాలకు తరలించినట్టుగా తెలుస్తోంది.
సతులు ఇక్కడే…
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెల్చిన అభ్యర్థులు తమ ఇండ్లలోనే ఉండగా వారి పతులు మాత్రం క్యాంపులకు చేరినట్టుగా తెలుస్తోంది. ప్రధాన పార్టీలు మద్దతు కూడగట్టుకునేందుకు కార్పొరేటర్ల భర్తలను మాత్రమే తీసుకెళ్లగా ఎన్నికల్లో గెల్చిన కార్పొరేటర్లు మాత్రం కరీంనగర్ లోనే ఉన్నట్టుగా సమాచారం. వీరిని క్యాంపులకు తరలించినట్టయితే భర్తలు ఓ పార్టీ క్యాంపులో, అధికారికంగా గెల్చిన భార్యలు మరో పార్టీ క్యాంపులకు చేరే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్పొరేటర్లను తరలించేందుకు శనివారం నుండి స్పెషల్ ఆపరేషన్ చేపట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్ బల్దియాలో అనూహ్యమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.