karimnagar: చందా న్యూరో హస్పిటల్ పై ఫిర్యాదు…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ లోని చందా న్యూరో ట్రామా కేర్ ఆసుపత్రిపై లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బీఎంఎస్ అనుబంధ సంఘం అయిన టీఎస్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఈ మేరకు కరీంనగర్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు లేఖ అందించారు. కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చందా న్యూరో ఆసుపత్రిపై ఆరోపించారు. ఆసుపత్రిలో కార్మికులచే నిబంధనలకు విరుద్దంగా పని చేయించుకుంటున్నారని, రోజుకు 8 గంటలకు మించి అదనపు పని చేయించుకుంటూ పనికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నారు. కార్మికులు తమకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని కోరితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ లో పని చేస్తున్న వారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సాహసించలేకపోతున్నారని రాధాకృష్ణ వెల్లడించారు. చందా న్యూరో ట్రామా కేర్ సెంటర్ యాజమన్యం లేబర్ యాక్టును అనుసరించి పనిచేస్తున్న వారికి తగిన వేతనాలు అందించడంతో పాటు నిబంధనలకు విరుద్దంగా అదనపు పని గంటల విధానాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పార్కింగ్ ప్లేసెస్…

మరో వైపున నగరంలోని పలు ఆసుపత్రుల వద్ద పార్కింగ్ ప్లేసులు లేకుండా పోయాయని, పర్మిషన్ తీసుకునే సమయంలో పార్కింగ్ స్థలాలను చూపిస్తున్న యాజమాన్యం అక్కడ ల్యాబులు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆయన ఆసుపత్రులకు వెలుతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆసుపత్రి భవనంలో ఉన్న పార్కింగ్ ప్లేసులు ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించుకుంటుండడంతో అక్కడకు వెల్లే రోగులు, వారి బంధవులు రోడ్లపై వాహనాలను నిలుపుకోవల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ప్లేసుల్లో వాహనాలు నిలిపారంటూ జరిమానాలు విధిస్తున్నారన్నారు. ఆసుపత్రుల యాజమాన్యం పార్కింగ్ ప్లేసులను సొంత అవసరాలకు వినియోగించుకుంటుంటే అక్కడకు వెలుతున్న సాదారణ వ్యక్తులు జరిమానాల బారిన పడుతున్నారని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని క్యాదాసి ప్రభాకర్ అభ్యర్థించారు.అనుమతులు తీసుకునే సమయంలో ఆసుపత్రుల యాజమాన్యం చూపించిన పార్కింగ్ ప్లేసులను యధావిధిగా వాహనాలు నిలిపేందుకు ఉపయోగించే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.

karimnagarLatest NewsPrivate hospitalstelangana newsTG NEWS