Karimnagar: వారధి సొసైటీపై ఆరోపణల వెల్లువ…

తాజాగా మరో ఫిర్యాదు…

దిశ దశ, కరీంనగర్:

నిరుద్యోగ యువతకు కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన వారది సొసైటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వారధి ద్వారా నియామకాలు జరిపించే ప్రక్రియలో మెరిట్ ప్రాతిపదికగా తీసుకోవల్సి ఉన్నప్పటికీ సొసైటీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆంజనేయులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రూ. 2 లక్షలు తీసుకుని ఉద్యోగావకాశాలు కల్పించిన సంఘటనలు కూడా ఉన్నాయని, ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాలు భర్తి చేయాల్సి ఉండగా 400 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 10మందిని ఎంపిక చేయగా ఇద్దరు ఉద్యోగాలు చేయడం మానకున్నారని, వీరి స్థానంలో మరో ఇద్దరిని భర్తీ చేసేప్పుడు మెరిట్ పరిగణనలోకి తీసుకోకుండా ఇతరులకు ఉద్యోగావకాశాలు కల్పించారని యుగంధర్ ఆరోపించారు. వారధి సొసైటీలో ఉద్యోగావకాశాలు కల్పించే విషయంలో ఇష్టారీతిన వ్యవహరించడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మరో 52 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందుకు సంబంధించిన వ్యవహారంలో కూడా పైరవీలు జరుగుతున్నాయన్నారు. నోటిఫికేషన్ విడుదలై 4 నెలలు గడుస్తున్నా నియామక ప్రక్రియ మాత్రం జరగలేదన్నారు. వారధి సొసైటీలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణపల్లి యుగంధర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని కోరారు.

గతంలో…

కరీంనగర్ వారధి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గతంలో  జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వారధి సొసైటీలో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ చేయాలని కోరారు. సొసైటీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆంజనేయులను తొలగించాలని కోరారు. తాజాగా మరో ఫిర్యాదు కూడా రావడంతో వారధి సొసైటీ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విచారణకు ఆదేశించారు.

karimnagar newsLatest NewsPamela Satpathy iastelangana newsTG NEWS