ఏప్రిల్ లోనూ ‘మార్చ్’కు తప్పని కష్టాలు

దిశ దశ, హుజురాబాద్:

శాంతినగర్ లోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ క్యాంపులో వాతావరణం మళ్లీ అశాంతిని రేకెత్తించింది. రంజాన్ పర్వదినం కావడంతో శనివారం భట్టి తన పాదయాత్రకు బ్రేకు ఇవ్వడంతో సెదతీరుతున్న పార్టీ శ్రేణులను మరోసారి ప్రకృతి ఇబ్బందుల్లోకి నెట్టింది. గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద భట్టి క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అర్థరాత్రి కురిసిన వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో క్యాంపు టెంట్లు నేలకూలాయి. దీంతో అప్పటి వరకు టెంట్లో ఉన్న భట్టి బస్సులోకి వెల్లగా, ఆయన అనచరులు, పార్టీ శ్రేణులు ఆరు బయటే వేచి చూసి వాతావరణం సానుకూలంగా మారిన తరువాత విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా శనివారం సాయంత్రం కూడా మరోసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వడగండ్ల వాన కలవరపెట్టడంతో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. అయితే జమ్మికుంట మండలం శాంతినగర్ లోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శిబిరంపై ఈదురు గాలులు, వర్షం ప్రభావం మరోసారి పడింది. దీంతో క్యాంపులోని టెంట్లు కుప్పకూలిపోవడంతో పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడ్డారు. భట్టి విక్రమార్క కూడా టెంట్ల వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించడంతో ఆయన కూడా తడిసి ముద్దయ్యారు. మండే ఎండలు కాయాల్సిన ఏప్రిల్ మాసంలోనూ పీపుల్స్ ‘మార్చ్’ ను ప్రకృతి వెంటాడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారు.

CLP leader Bhatti PadayatraCONGRESS NEWSkarimnagar newsLatest Newstelangana newstpcc