బురఖా వేసుకుని చోరీలు…
దిశ దశ, కరీంనగర్:
రద్దీగా ఉండే ఆసుపత్రిలో అయితే తమను ఎవరూ పట్టించుకోరన్న నమ్మకంతో పక్కాగా స్కెచ్ వేసుకున్నారు. ఇందుకు ఆసుపత్రి అయితే మరీ మంచిదని భావించి చోరీ చేసేందుకు యత్నించారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని బురఖా వేసుకోవాలని కూడా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి కథనం మేరకు… కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ చల్మెడ్ ఆసుపత్రిలో గురువారం ఇద్దరు బురఖా వేసుకున్న వ్యక్తులు వాష్ రూంలో మహిళ మెడలోంచి బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించారు. మత్తు వచ్చేందుకు స్ప్రే చేసినప్పటికీ బాధితురాలు తేరుకుని అరవడంతో సమీపంలోనే ఉన్న పేషెంట్లు, అటెండెంట్లు అక్కడకు చేరుకున్నారు. దీంతో బురఖా వేసుకున్న వ్యక్తులు ఇద్దరూ కూడా చల్మెడ ఆసుపత్రి నుండి తప్పించుకుని పరార్ అయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎండీ మిరాజున్నీసా (39), చిప్ప సాయినాథ్ (24)లుగా గుర్తించిన పోలీసులు వారిని 24 గంటల్లోగానే అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు మిరాజున్నీసా గతంలో ఓ సారి చల్మెడ ఆసుపత్రిలోనే చోరీకి విఫల యత్నం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
పకడ్భందీగా…
బురఖాలు వేసుకుని చోరీకి పాల్పడినట్టయితే తమను ఎవరూ గుర్తించరని, దొంగతనం చేసినా పోలీసులకు చిక్కే అవకాశం లేదని భావించిన మిరాజున్నీసా తన ఇంటి సమీపంలోని సాయినాథ్ ను కూడా ఇందుకు పురమాయించింది. సులవుగా డబ్బు సంపాదించవచ్చన ఆలోచనతో ఇద్దరూ కలిసి దొంగతనాలు చేసేందుకు పథకం అమలు చేసుకున్నప్పటికీ కరీంనగర్ రూరల్ పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే దొంగతనం చేసేప్పుడు మత్తు స్ప్రే చేసినట్టయితే బాధితుల నుండి ఆభరాణాలు చోరీ చేయడం ఈజీగా ఉంటుందని టీవీ సీరియల్స్ లో చూసిన మిరాజున్నీసా దానిని కొనుగోలు చేసి చోరీ చేసేందుకు ప్రయత్నించింది. చల్మెడ ఆసుపత్రిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను 24 గంటల్లోగానే పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఊ నిరంజన్ రెడ్డితో పాటు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ లు అభినందించారు.