KCR: తూర్పు… పడమర… ఉమ్మడి జిల్లాలో అన్నా చెల్లెల్ల పర్యటన…

దిశ దశ, వరంగల్:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్న చెల్లెల్ల పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఒకే రోజు ఇద్దరు ఉమ్మడి జిల్లాలో టూర్ చేయడం చర్చకు దారి తీసింది. పార్టీ కార్యక్రమాల్లో అన్న పాల్గొంటే… జాగృతి సంస్థ కార్యక్రమాల్లో చెల్లెలు హాజరయ్యారు.

అన్న అటు…

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పరకాల, భూపాలపల్లిల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటించారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో పాటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు కేటీఆర్. గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాలలో కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపణి చేశారు. అనంతరం ఆయన రాష్ట్రంలో కేసీఆర్ పాలన సమయంలో ఎలాంటి సేవలు అందాయి అన్న విషయాలను వివరిస్తూనే అధికార కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎత్తి చూపారు. ఈ సందర్భంగా కాటారం మండల కేంద్రానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థికి మంథని ఇంఛార్జి పుట్ట మధు అందించిన రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. భూపాలపల్లి జిల్లా ఇస్సిపేటలో విగ్రహావిష్కరణ, భూపాలపల్లిలో సమావేశంలో ప్రసంగించారు కేటీఆర్.

చెల్లెలు ఇటు…

తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కల్వకుంట్ల కవిత కూడా ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హన్మకొండ పట్టణంలో మీడియాతో మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ చేసిన పోరాటం, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. అనంతరం చెన్నరావుపేట మండలంలో బోనాల వేడుకలకు వెల్తూ గీసుగొండలో వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయిన మహిళా కూలీలతో ముచ్చటించారు.

ఒకటే తీరు…

అయితే పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొంటే, జాగృతి సంస్థ కార్రక్రమాలకు కవిత హజరయ్యారు. అన్నా చెల్లెల్లు వేర్వేరుగా పాల్గొన్నప్పటికీ ఇద్దరూ కూడా తండ్రి కేసీఆర్ గురించే పదే పదే ప్రస్తావించడం గమనార్హం. అయితే కేటీఆర్ మాట్లాడుతూ నాట్లు పడినప్పుడు రైతు బంధు అందితే… కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓట్లు వచ్చినప్పుడే సాయం అందిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే తమ పాలన గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేశారు కేటీఆర్. జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కూడా నీళ్లు, నిధులు నియామకాల అన్న నినాదం, సాగు నీటి రంగాల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నామో వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో విఫలం అయిందని కవిత ఆరోపణలు చేశారు. అన్నా చెల్లెల్లు ఇద్దరూ ఎవరికి వారే పర్యటనలు చేసినప్పటికీ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం గమనార్హం. అన్నా చెల్లెల్ల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం ఊపందుకున్న తరువాత ఎడమొఖం… పెడ మెఖం అన్నట్టుగా నడుచుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ నేఫథ్యంలో ఒకే రోజున ఒకే ఉమ్మడి జిల్లాలో అన్నా చెల్లెలిద్దరూ పర్యటించడం మాత్రం సరికొత్త చర్చకు దారి తీసింది. అయితే ఇద్దరూ కూడా తండ్రి కేసీఆర్ ను కొనియాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ ను ఎండగట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

BRS PARTYkalvakuntlaktrTG NEWSwarangal