దిశ దశ, దండకారణ్యం:
తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై ఎట్టకేలకు బలగాలు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశాయి. మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ గా ఉపయోగపడుతున్న ఈ గుట్టలను స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలాన్ని ఆనుకుని ఉన్న కర్రె గుట్టలపై బలగాల కదలికలు సులువుగా కొనసాగించాలని భావించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం కూడా చేయించారు. దాదాపు 15 కిలో మీటర్ల మేర రోడ్డును కూడా వేయించి కర్రె గుట్టలపై బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు.
గత సంవత్సరం…
చత్తీస్ గడ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ చేపట్టిన తరువాత బలగాల మోహరింపు తీవ్రంగా పెరిగింది. సరిహద్దుల నుండి కీకారణ్యాలన్ని కూడా బలగాలు జల్లెడ పట్టడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని కర్రె గుట్టలపై మావోయిస్టుల ఉనికి బయట పడింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎన్ కౌంటర్లు కూడా ఈ ప్రాంతంలో జరిగాయి. అయితే కర్రె గుట్టలపైకి చేరుకుంటున్న మావోయిస్టులు బలగాలకు చిక్కకుండా సేఫ్ జోన్ గా మార్చుకున్నాయని గమనించిన పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ స్పెషల్ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో కర్రె గుట్టలపై భారీ ఎత్తున బలగాలను మోహరించడం, హెలిక్యాప్టర్లను కూడా వినియోగించడంతో మావోయిస్టుల మెయిన్ షెల్టర్ పై పట్టు బిగించినట్టయింది. దాదాపు 15 రోజుల పాటు జరిగిన ఈ కూంబింగ్ ఆపరేషన్ లో పలువురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో చనిపోగా, డంప్ లను కూడా గుర్తించారు. ఆ తరువాత ఐబీ చీఫ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా కర్రె గుట్టలను సునిశితంగా పరిశీలించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
చత్తీస్ గడ్…
చత్తీస్ గడ్ లోని సరిహద్దుల మీదుగా కర్రె గుట్టలపైకి రహదారి నిర్మాణం చేపట్టడం ఆలస్యం అవుతుందని భావించిన అధికారులు ఈ బాధ్యతను తెలంగాణలోని సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాయి. ఈ మేరకు రోడ్డు నిర్మాణం చేయించిన CRPF అధికారులు పామునూరు వద్ద ఫార్వర్డ్ ఆఫరేటింగ్ బేస్ (FOB) ఏర్పాటు చేశారు. తాత్కాలిక రహదారి నిర్మాణం చేయించిన అధికారులు భవిష్యత్తులో బీటీ రోడ్డుగా మార్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. 50 రోజుల్లోనే 15 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయించిన అధికారులు జెల్లా, డోలీ తడపాల్ వరకు కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ బేస్ క్యాంపులో వెయ్యి మంది వరకు బలగాలను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ సీఆర్పీఎఫ్, కోబ్రా, తెలంగాణ సివిల్, గ్రేహౌండ్స్ ఫోర్సును నియమిస్తామని CRPF ఐజీ టి విక్రమ్ ప్రకటించారు.
శిక్షణ కోసం…
కర్రె గుట్టలపై గతంలో మావోయిస్టులు సాయుధ శిక్షణ కూడా తీసుకున్నారని ఐజీ వివరించారు. ఏడాది క్రితం వరకూ కూడా బలగాల కూంబింగ్ ఆపరేషన్లను తప్పించుకుని ఈ గుట్టలపై షెల్టర్ తీసుకునే వారని తెలిపారు. మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకంగా ఉపయోగపడుతున్న కర్రె గుట్టలపై FOB ఏర్పాటు చేయడంతో భారీ లక్ష్యాన్ని చేధించినట్టయిందని విక్రం వెల్లడించారు.