పేపర్ లీకేజీ వెనక ‘బండి ’ కుట్ర

మంత్రి గంగుల ధ్వజం

దిశ దశ, కరీంనగర్:

పేపర్ లీకేజీల వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంజయ్ కి తెలిసే పేపర్లు లీకేజీ అవుతున్నాయన్నారు. లీకేజీల వెనక బీజేపీ కుట్ర ఉందని దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ అయ్యాక సోషల్ మీడియాలో వైరల్ చేశారు కానీ పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వాలేదో చెప్పాలన్నారు. కమలా పూర్ లో లీకేజీ చేసిన ప్రశాంత్ అనే యువకుడు బండి సంజయ్ తో వందల కాల్స్ మాట్లాడారని, వాట్సాప్ చాట్స్ ను ఢీకోడ్ చేస్తామని, ఇందులో ఎంతటి వారికైనా శిక్ష తప్పదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. బీజేపీ విష రాజకీయాలకు తెరలేపిందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లీకేజీ ప్రభుత్వంగా చిత్రీకరించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోందని, పేపర్ లీకేజీ లో బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారన్నారు. గ్రూప్స్ పేపర్ల లీకేజీలో ఏ2 నిందితుడు A2 ముద్దాయిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి బీజేపీ నాయకుడని, పదో తరగతి హిందీ పేపర్ లీకేజీలో నిందితునిగా ఉన్న ప్రశాంత్ కూడా బీజేపీ కార్యకర్తేనన్న విషయం గమనించాలని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కి పేపర్ రాగానే బీజేపీ గ్రూపుల్లో ప్రచారం చేశారని, అశాంతి అలజడి రేపి బీహార్ సంస్కృతిలా తెలంగాణ ను మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ గుండాయిజాన్ని ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు, అభ్యర్థుల తల్లితండ్రులు ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం బీజేపీయేనని గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

bandi sanjaycm kcrgangula kamlakarLatest Newsleakage of tspsc paperstelangana newsTenth Class Paper Leakage