పెద్దపల్లి జిల్లాలో ఘటన…
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వలస కార్మికుల కుటుంబానికి చెందిన మైనర్ పై మృగాళ్ల గుంపు అఘాయిత్యానికి ఒడిగట్టింది. పొట్ట కూటి కోసం మధ్యప్రదేష్ నుండి వలస వచ్చిన కుటుంబానికి చెందిన బాలికపై పైశాచికత్వానికి ఒడిగట్టారు. అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని మధ్యప్రదేష్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు భవననిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందేందుకు మధ్యప్రదేష్ నుండి కూలీల కుటుంబాలు వలస వచ్చాయి. రెండు రోజుల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో నలుగురు వ్యక్తులు 16 ఏళ్ల బాలికను తీసుకెల్లి అత్యాచారానికి ఒడిగట్టడంతో తీవ్ర రక్త స్రావం కావడంతో అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన కూలీలు స్వస్థలానికి తీసుకెల్తుండగా మార్గ మధ్యలో మరణించినట్టు ఆమె బంధువులు తెలిపారు. అయితే ఆమెపై దారుణానికి ఒడిగట్టిన విషయం బయటికి చెప్తే చంపేస్తామన్నారని బాలిక బంధువులకు వివరించగా ఈ మాటలను వారు రికార్డు చేశారు. పెద్దపల్లి పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.