దిశ దశ, వరంగల్:
పీపుల్స్ వార్ నుండి మావోయిస్టు పార్టీ వరకూ విప్లవ ప్రస్థానంలో కొనసాగిన ఆయన సొంత జిల్లాలో పర్యటన చేపట్టారు. ఐదు నెలల క్రితం చత్తీస్ గడ్ ప్రభుత్వం ముందు ఆయుధ విరమణ ప్రకటించి అక్కడే ఉండిపోయిన ఆయన అనూహ్యంగా తన సహచరుల కుటుంబాలను కలవాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ మహా నగరానికి వచ్చిన ఈ మావోయిస్టు నాయకుడు దశాబ్దాల క్రితం తనతో కలిసి పనిచేసిన వారి కుటుంబాలతో మమేకం అయ్యేందుకు చొరవ తీసుకున్నారు.
బట్టుపల్లిలో…
ఖాజీపేట సమీపంలోని బట్టుపల్లి ఫంక్షన్ హాల్ వేదికగా అమర వీరుల కుటుంబాలతో మమేకం అయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇంఛార్జి తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీష్. ఆయనతో పాటు రాజ్ మన్ భాస్కర్, వెంకటేశ్, శ్యామ్, రణితతో పాటు దాదాపు 11 మంది మాజీ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తమ తమ స్వగ్రామాలకు వచ్చారు. ఈ సందర్భంగా విప్లవ ప్రస్థానం తొలినాళ్లలో తనతో కలిసి పని చేసిన, పార్టీతో మమేకమైన అమరవీరుల కుటుంబాల సమ్మేళనం ఏర్పాటు చేసింది ఆశన్న బృందం. సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అలనాటి తన సహచరుల కుటుంబ సభ్యులను కలిసి వారిని అక్కున చేర్చుకోవాలన్న లక్ష్యంతో ఆశన్న ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలనాటి విప్లవకారుల కుటుంబ సభ్యులు తమవారిని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా పౌరహక్కుల నాయకులు, మాజీ నక్సల్స్ తో కూడా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
వినూత్న నిర్ణయం…
వనాలు వీడి జనాల్లోకి వచ్చిన మాజీ నేతలంతా కూడా తమ కుటుంబ సభ్యులను, సన్నిహితులను కలిసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆశన్న మాత్రం తనతో పాటు పని చేసిన బృందాన్ని వెంటబెట్టుకుని వచ్చి మూడు దశాబ్దాల క్రితం విప్లవ పంథాలో కొనసాగిన వారి కుటుంబాలతో మమేకం అయ్యేందుకు చొరవ తీసుకోవడం విశేషం.