దిశ దశ, కాళేశ్వరం:
అలనాటి శిల్ప కళా సౌందర్యానికి సజీవ సాక్ష్యాలు ఆదరణకు నోచుకోకుండా పోతున్నాయి. శతాబ్దాల క్రితం తీర్చిదిద్దిన శిల్పాలు ఎండకు ఎండుతూ… వానకు నానుతూ ఉండిపోయాయి. ఆలయ జీర్ణోద్దరణ సమయంలో వెలుగులోకి వచ్చిన విగ్రహాలను ఆరు బయటే వదలేయడంతో వాటి ఆలనా పాలనా చూసేవారు లేకుండా పోయారు. కాకతీయులు, విజయ చోళుల కాలంతో పాటు చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసుకున్న కాళేశ్వరం క్షేత్రంలో వందలాది శిల్పాలు కాలగర్భంలో కలిసిపోయాని పూర్వీకులు చెప్తుండేవారు. ఇక్కడ ప్రధాన ఆలయం మాత్రమే భక్తుల రాకపోకలతో కిక్కిరిసి పోతోంది. అయితే శిల్ప కళ ఉట్టిపడే సోమేశేఖర ఆలయం, చంద్రశేఖర ఆలయాలే కాకుండా పలు చోట్ల విగ్రహాలు, చరిత్ర ఆధారాలు కనిపించేవి. గోదావరి తీరం, కాళేశ్వరం గ్రామంలో ఎక్కడ చూసినా శిల్పాలు ఉండేవి. అయితే కాళేశ్వరం ప్రధాన ఆలయం సమీపంలోని మహా సరస్వతి ఆలయం ముందు ఉన్న విగ్రహాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాళేశ్వరంలోని పురాతన విగ్రహాలపై పురవాస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. పురావస్తు విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్య కాళేశ్వరంలోని పురాతన విగ్రహాలను పరిశీలించి వాటిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ ఈఓ మహేష్ కాళేశ్వరంలోని శిల్పాల గురించి వివరించారు. అయితే త్రివేణి సంగమ క్షేత్రంగా భాసిల్లుతున్న కాళేశ్వరంలోని పార్వతి ఆలయం ముందు చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం, ఇతర శిల్పాలు కూడా ఉన్నాయి. కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోకుండా పోతున్న శిల్పాల కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేసినట్టయితే గత వైభవాన్ని భావితరాలకు అందించే అవకాశం ఉంటుంది. పరివాహక ప్రాంతంలోని విగ్రహాలన్నింటిని మ్యూజియంలోకి తరలించి వాటి నేపథ్యం గురించి వివరించేందుకు పురవాస్తు శాఖ అధికారులు చొరవ తీసుకున్నట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.