తెరపైకి మరో అజ్ఞాత నేత… ఆ జాబితాలలో లేని పేరు..

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

మూడున్నర దశాబ్దాలుగా విప్లవ పార్టీలో పని చేస్తున్న ఆ అజ్ఞాత నక్సల్ నేత బయటకు రావాలంటూ ఆయన అన్న అభ్యర్థిస్తున్నారు. ఆపరేషన్ కగార్ వల్ల పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్టయితే బావుంటుందని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల వరయ్య విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. తన తమ్ముడు బత్తుల కాంతయ్య 1991లో కనిపించకుండా పోయాడని కొంతకాలం తరువాత ఆయన పీపుల్స్ వార్ పార్టీలో చేరినట్టుగా సమాచారం అందిందని వరయ్య వివరించారు. అయితే అప్పటి నుండి కాంతయ్య ఎక్కడున్నాడు..? ఎలా ఉన్నాడన్న విషయం మాత్రం తమకు తెలియరాలేదని వెల్లడించారు. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో జనజీవనంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కిషన్ జీతో…

బత్తలు కాంతయ్య చాలా కాలం పాటు పార్టీ అగ్రనేతల సూచనల మేరకు పని చేశాడని తెలుస్తోంది. మల్లోజ్జుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ ఆధ్వర్యంలో పార్టీలో పని చేసిన కాంతయ్య ముప్పాళ లక్ష్మణ్ రావు, అలియాస్ గణపతి వంటి ప్రముఖులతో కూడా సంబంధాలు ఉండేవని స్థానికంగా ప్రచారం. అయితే 1991 వరకు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కాంతయ్య ఆ తరువాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయినట్టుగా సమాచారం. పార్టీ ఆయుధాల కర్మాగారం, స్పెషల్ జోనల్ కమిటీ, స్టేట్ కమిటీలతో పాటు పలు విభాగాల్లో పని చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా కాంతయ్య అన్న వరయ్య ఇచ్చిన పిలుపుతో ఆయన పేరు తెరపైకి వచ్చింది.

ఆ జాబితాలో…

మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న అజ్ఞాత నక్సల్స్ నాయకుల జాబితాను ఇటీవల తెలంగాణ పోలీసులు విడుదల చేశారు. దీంతో పాటు అజ్ఞాతంలోకి వెల్లి ఆచూకి లేకుండా పోయిన వారి వివరాలను కూడా వెల్లడించారు. 35 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వారి గురించి తెలియడం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. అజ్ఞాతంలో ఉన్న వారి జాబితాలో అయినా జాడ లేకుండా పోయిన వారి జాబితాలో అయినా బత్తుల కాంతయ్య పేరు లేకపోవడం గమనార్హం. తాజాగా కాంతయ్యను బయటకు రావాలని ఆయన అన్న వరయ్య పిలుపునివ్వడంతో మరో నేత అజ్ఞాతంలో ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చింది.

chhattisgarhdandkaranyamLatest Newsmaoist newsMAOIST PARTY
Comments (0)
Add Comment