MAOIST: గరియాబంద్ అడవుల్లో గర్జించిన తుపాకులు…

కేంద్ర కమిటీ సభ్యుని మృతి…

దిశ దశ, దండకారణ్యం:

గరియాబంద్ అడవులు కాల్పుల మోతతో మరోసారి గర్జించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహా మరికొంత మంది ముఖ్య నాయకులు ఈ ఎదురు కాల్పుల్లో మరణించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నాయి. గురువారం ఉదయం నుండి కొనసాగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం వాటిల్లిందిన కీకారణ్యాల్లోకి చొచ్చుక వెల్లిన బలగాలు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు ప్రారంభం అయ్యాయని ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన దాదాపు 10 నుండి 15 మంది వరకు మరణించి ఉంటారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), సెంట్రల్ రీజనల్ బ్యూరో మెంబర్ (CRBM), ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రాజేష్ అలియాస్ రామచందర్ అలియాస్ రాజేంద్ర మరణించినట్టుగా గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. బాలకృష్ణది వరంగల్ ఉమ్మడి జిల్లా మడికొండ స్వస్థలం కాగా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం విప్లవ ప్రస్థానంలోకి వెళ్లారు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఘటన స్థలం నుండి భారీగ అత్యాధునిక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గురువారం సాయంత్రం వరకు 9 మంది నక్సలైట్ల మృతదేహాలు గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఉన్నాయని, మందుపాతరలు పేలే ప్రమాదం ఉన్నందున రాత్రి గాలింపు చర్యలు చేపట్టడం లేదని రాయ్‌పూర్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మృతదేహాలను అటవీ ప్రాంతం నుండి ఆసుపత్రికి తరలించే పనిలో బలగాలు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.  గరియాబంద్ అడవుల్లో E30, STF, COBRA బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా సమాచారం.

అదే ఫారెస్ట్…

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి మరణించారు. ఆయన ఇదే గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. ఆయనతో పాటు పార్టీ క్యాడర్ కూడా భారీగా ప్రాణాలో కోల్పోయిన ఈ సంఘటన సంచలనం అయింది. తాజాగా సెప్టెంబర్ 11న కూడా ఇదే గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ మరణించడం గమనార్హం.

ఒడిషా క్యాడర్…

ఈ ఏడాది ఒడిషాతో సంబంధాలు ఉన్న కీలక నేతలకు కలిసి రానట్టుగా ఉంది. 9 నెలల్లోనే ముగ్గురు ముఖ్య నాయకులను కోల్పోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒడిషా ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న చలపతి జనవరిలో, ఆంధ్రా ఒడిషా బార్డర్ ఇంఛార్జిగా పని చేస్తున్న చర్చల ప్రతినిధి, కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ జులైలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. తాజాగా ఒడిషా కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ మరణించారు.

బలిమెల ఘటన…

2008లో తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలపై ముప్పేట దాడి చేసిన ఘటనను మోడెం బాలకృష్ణ వ్యూహ రచన చేయడమే కాకుండా ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారు. బలిమెల నది తీరంలోని ఒడిషా అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం షెల్టర్ తీసుకున్న సమాచారం అందుకున్న తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అయితే రెండు రోజుల పాటు గ్రేహౌండ్స్ బలగాలు ఒడిషా సరిహద్దు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణం కారణంగా బలగాలు తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో బలిమెల నదిని నాటు పడవలో దాటుతుండగా మావోయిస్టులు అటక్ చేశారు. ఈ ఘటనలో 38 మంది గ్రేహౌండ్స్, సివిల్, హోంగార్డ్ చనిపోయారు. 2008 జూన్ 30న జరిగిన ఈ ఘటన కూంబింగ్ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. నదిలోకి దిగి సేఫ్ అయిన వారు దరి చేరిన తరువాత దొరకబట్టుకుని మరీ చంపేసిన ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కర్త, క్రియ అంతా కూడా మోడెం బాలకృష్ణే కావడం గమనార్హ. ఆయన ఈ రోజు జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చించిందని చెప్పక తప్పదు.

chhattisgarhDANDAKARNYAMencountermaoist newsMAOIST PARTY