ఏడుగురు మావోయిస్టుల ఎన్ కౌంటర్
దిశ దశ, దండకారణ్యం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లా అటవీ ప్రాంతం కాల్పుల మోతలతో దద్దరిల్లిపోయింది. వరసగా రెండో రోజు కూడా ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జిల్లాలోని రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అతని భార్య, డివిజనల్ కమిటీ మెంబర్ రాజే తో పాటు మరో నలుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఉదయం అల్లూరి జిల్లాలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఏఢుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ఏపీ పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా వజ్ర కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివ మరణించాడు. AOB స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోగారావు మందుపాతరలు పేల్చడంలో వ్యూహకర్తగా వ్యవహరించేవాడు. గత మే నెలలో దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవ రావు అలియాస్ బసవరాజ్ గార్డ్స్ కమాండర్ గా పని చేసి, ప్రస్తుతం డివిజనల్ కమిటీ మెంబర్ హోదాలో ఉన్న జ్యోతి అలియాస్ సరిత మరణించింది. ఈమె సుక్మా జిల్లా కిష్టారం ప్రాంతంలోని బూర్గులంక నివాసి అని పోలీసులు పేర్కొన్నారు. కమ్యూనికేషన్ టీమ్ స్పెషల్ జోనల్ కమిటీలో ఏరియా కమిటీ సభ్యునిగా పని చేస్తున్న సురేష్ అలియాస్ రమేష్ మరణించాడు. కేంద్ర కమిటీ సభ్యుడు కటుకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ దాదాకు అంగరక్షకునిగా పని చేసిన లోకేష్ అలియాస్ గణేష్, ఏరియా కమిటీ మెంబర్లు సైను అలియాస్ వాసు, శమ్మిలు కూడా చనిపోయారని ఏపీ పోలీసులు ప్రకటించారు.
దేవ్ జీ సేఫ్…
బుధవారం ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురు కాల్పలు జరిగాయని వెలుగులోకి రాగానే ఈ ఘటనలో చనిపోయిందెవరన్న చర్చ తీవ్రంగా సాగింది. జీఎం వలస అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పోలీసులు విడుదల చేసిన జాబితాలో దేవ్ జీ పేరు లేకపోవడంతో ఆయన క్షేమంగానే ఉన్నాడని స్ఫష్టం అయింది.