దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీకి ఆంధ్రా ఒడిషా బార్డర్ అటవీ ప్రాంతం ప్రాణాల మీదకు తెస్తున్నట్టుగా ఉంది. ఇదే అటవీ ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరితో పాటు పార్టీ ముఖ్య నాయకత్వాన్ని కోల్పోవడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఐదు నెలల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లలో కేంద్ర కమిటీ సభ్యులు కోల్పోయారు. జూన్ 18న రంపచోడవరం సబ్ డివిజనల్ పరిధిలోని మారేడుమిల్లి సమీపంలోని కింటుకూరు వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ తో పాటు పలువురు మావోయిస్టులు చనిపోయారు. ఏఓబి ఇంఛార్జిగా ఉన్న గణేష్ ఎదురుకాల్పుల్లో చనిపోవడం సంచలనంగా మారింది. తాజాగా నవంబర్ 18 ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీలో అత్యంత కీలకమైన నేతగా ఉన్న మడావి హిడ్మా అతని భార్య రాజేతో పాటు మరో నలుగురు మరణించారు. ఇద్దరు కీలక నేతలు కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే మరణించడం గమనార్హం.
అర్బన్ పై దృష్టి సారించారా..?
చత్తీస్ గడ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్తర్ అటవీ ప్రాంతానికి చెందిన పార్టీ శ్రేణులు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి ఎన్ కౌంటర్ వివరాలు ఇంటలీజెన్స్ చీఫ్, అడిషనల్ డీజీపీ మహేష్ కుమార్ లడ్డా మీడియాకు వివరాలను వెల్లడించారు. కృష్ణ జిల్లా విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో 31 మంది మావోయిస్టులను మంగళవారం ఉదయం నుండి అరెస్ట్ చేశామని ప్రకటించారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సెక్యూరిటీగా వ్యవహరించే పీఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ కు చెందిన వారు ఉన్నారని లడ్డా వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి చెందిన చత్తీస్ గడ్ క్యాడర్ అర్బన్ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా మంగళవారం నాటి అరెస్టులను బట్టి అర్థం అవుతోంది. ఏఓబి సరిహద్దులు దాటి ఏపీలో సేఫ్ జోన్ లో ఉన్నట్టయితే తాము సురక్షితంగా ఉంటామని మావోయిస్టు పార్టీ నాయకులు అంచనా వేసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే హిడ్మా కూడా ఏపీ వైపు వస్తున్న క్రమంలో ఎదురు కాల్పుల్లో మరణించాడా లేక ఏఓబీ అడవుల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగించేందుకు డెన్ ఏర్పాటు చేసుకున్నాడా అన్న విషయంపై మాత్రం స్పష్టత రావల్సి ఉంది.
రక్షణ వలయం…
దండకారణ్య అటవీ ప్రాంతంలో బలగాలు ముప్పేట దాడులు చేస్తుండడడంతో కేంద్ర కమిటీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. విప్లవోద్యమంలో కేంద్ర కమిటీ కార్యదర్శిని కోల్పోవడంతో పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు తేల్చి చెప్తున్నాయి. ఆ తరువాత కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్ కౌంటర్ లలో మరణించడం, అభయ్, ఆశన్నవంటి ముఖ్య నేతలు ఆయుధాలతో జనజీవనంలోకి రావడం జరిగింది. నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ తరువాత హిడ్మా స్వీయ రక్షణ చర్యలపై దృష్టి సారించినట్టుగా ప్రచారం జరిగింది. తన వెంట నడిచే సాయుధు నక్సల్స్ అంతా కూడా ఆదివాసి తెగలకు సంబంధించిన వారు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాడని సమాచారం. దాదాపు 200 మంది మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ బెటాలియన్స్ టీమ్ ను తన వెంట అట్టిపెట్టుకున్న హిడ్మా బలగాలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలతో పాటు సమీప ప్రాంతాల్లో హిడ్మా షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకున్నాడన్న సమాచారం మేరకు వేల సంఖ్యలో బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టల పేరిట గాలింపు చర్యలు చేపట్టాయి. అప్పుడు ఆయన బలగాల కళ్లుగప్పి తప్పించుకుని సేఫ్ జోన్ కు వెళ్లిపోయాడన్న ప్రచారం కూడా జరిగింది. ఇలా పలుమార్లు బలగాలకు చిక్కకుండా తప్పించుకున్న హిడ్మా ఇటీవల కాలంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను తట్టుకునేందుకు స్వీయ రక్షణ చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 200 మంది వలయంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న హిడ్మా కేవలం రాత్రి వేళల్లో మాత్రమే అడవుల్లో సంచిస్తాడని పగటి పూట్ డెన్ లకే పరిమితం అవుతాడని కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. బలగాలను అంతమొందించడంలో అయినా కవ్వింపు చర్యలకు పాల్పడి పైచేయి సాధించడంలో అయినా పకడ్భందీ వ్యూహాంతో ముందుకు సాగుతాడని కూడా పేరుంది. జన జీవనంలో కలిసే విషయంలో కూడా విబేధించిన హిడ్మా పార్టీని, ముఖ్య నాయకత్వాన్ని కాపాడుతాడన్న నమ్మకం కూడా బలంగా ఉండేది. హిడ్మా కారణంగానే కొంతమంది కేంద్ర కమిటీ నాయకులు బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. పార్టీకి ఆయువుపట్టుగా నిలిచిన ఆయన తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించడం సంచలనంగా మారింది.
20 రోజుల క్రితమే…
హిడ్మాను గత నెల 28నే పోలీసులు పట్టుకున్నారని ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు వేడంగి చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ లు ఆరోపిస్తున్నారు. వీరిద్దరి పేరిట విడుదలైన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెల 28న హిడ్మాతో పాటు అతని సహచరులు ఏపీలో షెల్టర్ తీసుకుని ఉన్నారని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని నిరాయుధులను చేసి బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేశారని ఆరోపించారు.