దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బస్తర్ అటవీ ప్రాంతంలో బలగాలు ముందుకు సాగుతున్నాయి. కేంద్ర రిజర్వూ బలగాల ఆధ్వర్వంలో కీకారాణ్యాల్లో కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి పెట్టనికోటగా పేరుగాంచిన అభుజామఢ్ అటవీ ప్రాంతంలో తాజాగా మరో క్యాంపును BSF ఏర్పాటు చేసుకుంది. నారాయణపూర్ జిల్లాలోని జట్వర్ అటవీ ప్రాంతంలో BSF ఆధ్వర్యంలో ఈ ఏడాది మొదటి క్యాంపును ప్రారంభించడం గమనార్హం. ఇప్పటి వరకు ఒక్క నారాయణపూర్ జిల్లాలోనే 28 క్యాంపులను కేంద్ర రిజర్వూ బలగాలు ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు చెప్తున్నారు. మావోయిస్టులకు అత్యంత పట్టున్న అభూజామడ్ అటవీ ప్రాంతాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నట్టయితే నక్సల్స్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అంతరించిపోతాయని అంచనా వేస్తున్నారు పోలీసు అధికారులు. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతాల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అయనట్టుగా స్పష్టం అవుతోంది. బేస్ క్యాంపుల ద్వారా సమీప అటవీ ప్రాంతంపై పట్టు బిగించి రహదారులతో పాటు ఇతరాత్ర మౌళిక వసతులు కల్పించాలన్న యోచనలో చత్తీస్ గడ్ ప్రభుత్వం ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మాణం చేసినట్టయితే ఆదివాసీలు మావోయిస్టులను అక్కున చేర్చుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అభుజామడ్ అటవీ ప్రాంతంలో మరిన్ని బేస్ క్యాంపులన ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్ర రిజర్వూ బలగాల ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కీకారణ్యాలపై బలగాలు పట్టు బిగించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది.