Acb Telangana: రిటైర్డ్ అధికారి వద్ద లంచం… భూ సర్వే కోసం మామూళ్లు…

పట్టుకున్న ఏసీబీ అధికారులు

దిశ దశ, పెద్దపల్లి, మంచిర్యాల:

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఏసీబీ అధికారులు వేర్వేరుగా దాడులు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రెవెన్యూ సర్వేయర్ సునీల్ అతని ప్రైవేటు అసిస్టెంట్ రాజేందర్ రెడ్డిలను పట్టుకోగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ జూనియర్ అసిస్టెంట్ జి శ్రీనివాస్ రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

పెద్దపల్లిలో…

పెద్దపల్లి సమీపంలోని ఓ భూమి సర్వేకు సంబంధించిన నఖల్లు ఇవ్వడానికి సర్వేయర్ సునీల్ రూ. 20 వేలు డిమాండ్ చేశారు. తాను అంతగా ఇవ్వలేనని తగ్గించాలని బాధితుడు అభ్యర్థించగా రూ. 10 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. సర్వేయర్ సునీల్ తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డికి ఫోన్ పే చేయాలని బాధితునికి సూచించగా గత నెలలోనే ఈ డబ్బులను బదిలీ చేశారు. ఆ తరువాత సునీల్ అకౌంట్ కు ప్రైవేటు అసిస్టెంట్ బదిలీ చేయగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడంతో పాటు ఆడియో రికార్డు కూడా చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సునీల్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. వీరిని కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామన్నారు.


రిటైర్డ్ ఉద్యోగి వద్ద…

మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఇంఛార్జి జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జి శ్రీనివాసులు రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన అధికారికి సంబంధించిన బెనిఫిట్స్ కోసం ఫైల్ తయారు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు లంచం అడగగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ హోటల్ లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

acb caseACB RAIDSACB TELANGANAACB TrapTELANGANA ACB