డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన స్టూడెంట్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా గంగాధరలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక మోడల్ స్కూల్ లో ప్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో అప శృతి జరగడం అందరినీ షాక్ కు గురి చేసింది. శుక్రవారం గంగాధర మోడల్ స్కూల్ లో ప్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ సంతోషంలో మునిగిపోయారు. వేదికపై డ్యాన్స్ చేస్తున్న ప్రదీప్తీ అనే ఇంటర్ ఫస్టీయర్ విద్యార్థిని ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి గంగాధర ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని కరీంనగర్ తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ప్రదీప్తిని హుటాహుటిన కరీంనగర్ తరలించినప్పటికీ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. మండలంలోని వెంకటాయపల్లికి చెందిన గూడు అంజయ్య కూతురు ప్రదీప్తి అనారోగ్యంతో బాధపడుతున్నారని స్థానికంగా చెప్తున్నారు. ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమతో పాటే ఆడి పాడిన ప్రదీప్తి కానరాని తీరాలకు వెళ్లిపోయిందన్న విషయాన్ని మోడల్ స్కూల్ యంత్రాంగం, సహచర విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

crime newsCRIME TODAYkarimnagar newsLatest Newstelangana news