ధాన్యపు రాసుల నడుమ విగత జీవిగా మారి…

తిమ్మాపూర్ మండలంలో రైతు మృత్యువాత

దిశ దశ, మానకొండూరు:

అరుగాలం చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి వెల్లిన ఓ రైతు అక్కడే మృత్యువాత పడ్డాడు. చేతికొచ్చిన పంటను అమ్ముకుని అవసరాలు తీర్చుకుందామని కలలు కంటూ నిద్రించిన ఆ రైతు అక్కడే శాశ్వత నిద్రలోకి వెల్లిపోయాడు. ధాన్యపు రాశుల వద్దే నిద్రపోయిన ఆయనపై నుండి ట్రాక్టర్ వెల్లడంతో విగతజీవిగా మారిపోవడం స్థానికులను విషాదంలోకి నెట్టింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరుకు చెందిన ఉప్పులేటి మొండయ్య కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం వద్ద శుక్రవారం రాత్రి నిద్రపోయాడు. ధాన్యం తడవకుండా ఉండేదుకు సిద్దంగా ఉంచుకున్న ఓ పరదా కప్పుకుని పడుకున్న మొండయ్యపై నుండి శనివారం ఉదయం మిల్లుకు ధాన్యం తరలిస్తున్న ట్రాక్టర్ వెల్లింది. ఈ ఘటనలో మొండయ్య అక్కడికక్కడే పడి చనిపోవడం స్థానికులను కలిచివేసింది. ధాన్యం అమ్మేందుకు వెల్లిన ఆయన శవమై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎల్ఎండి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

crimecrime newsCRIME TODAYkarimnagar newstelangana crimetoday crime news