ఆలి అందని తీరాలకు వెల్లిందని…

గుండె ఆగి మరణించిన భర్త…

దిశ దశ, గంగాధర:

రెండు దశాబ్దాలుగా దాంపత్య జీవనం సాగిస్తున్నారు వారు. నీవు నాకు నేను నీకు ఒకరికి ఒకరం అనుకుంటూ కాలం వెల్లదీస్తున్న వారిని విధి వక్రీకరించింది. అనారోగ్యంతో మంచనా పడ్డ భర్త బాగోగులు చూసుకుంటున్న భార్య కానరాని తీరాలకు చేరగా.. ఈ విషయం తెలిసిన భర్త కూడా కుప్పకూలిపోయాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లికి చెందిన జోకుల పోశయ్య, సత్తవ్వలకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగకపోయినా కలత చెందక ఒకరిపై ఒకరు మమకారం పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. కూలీ నాలీ చేసుకుంటూ బ్రతుకుతున్న ఈ కుటుంబాన్ని అనారోగ్యం వెంటాడింది. రెండు నెలల క్రితం పోశయ్య పక్షవాతం బారిన పడడంతో మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో సత్తవ్వ పొట్ట కూటి కోసం కూలీకి వెల్తూ… భర్తకు సపరిచర్యలు చేస్తోంది. మానసిక క్షోభకు గురైన సత్తవ్వ సోమవారం గుండెపోటుకు గురి విగతజీవిగా మారింది. తన భార్య సత్తవ్వ తనకు దూరం అయిందని మనో వేదనకు గురైన పోశయ్య కూడా తుది శ్వాస విడిచాడు. అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఆ భార్యభర్తలను ఏక కాలంలో మృత్యువు కబళించడం స్థానికులను కంటతడిపెట్టించింది. భార్య చనిపోయిన విషయం తెలిసి తట్టుకోలేకపోయిన పోశయ్య కూడా తనువు చాలించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

crimecrime newsCRIME TODAYkarimnagar newsLatest Newstelangana news