మరో 15 మంది నక్సల్స్ చనిపోయినట్టు వెల్లడి…
దిశ దశ, జాతీయం:
ఝార్ఖండ్ రాష్ట్రంలో గురువారం ఉదయం నుండి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నాయకుడిని కోల్పోయింది. విప్లవోద్యమంలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు అనల్ దా అలియాస్ తుఫాన్ దా అలియాస్ పతిరాం మాంజీ, అలియాస్ రమేష్ ఈ ఘటనలో చనిపోయినట్టుగా పోలీసు అధికారులు ప్రకటించారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను ఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామని కూడా ప్రకటించారు. రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా సారండ, కుమ్డి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేతల కదలికలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న బలగాలు బుధవారం రాత్రి నుండి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం మావోయిస్టులు ఎదురు పడడంతో ఎన్ కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది.
కీలక నేత…
ఝార్ఖండ్ లోని గిర్ధి జిల్లా దుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జహర్ వాలే గ్రామానికి చెందిన పతిరాం మాంజీ సుదీర్ఘ కాలంగా విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. బీహార్, ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా (BJ SAC), ఈస్టర్న్ రీజనల్ బ్యూరో సభ్యునిగా (ERB), కేంద్ర కమిటీ సభ్యునిగా (CCM), సెంట్రల్ మిలటరీ కమిషన్ సభ్యునిగా (CMC) పని చేస్తున్న పతిరాం మాంజీ బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాలుగా కేంద్ర కమిటీలో సభ్యునిగా కొనసాగుతున్న మాంజీ లక్ష్యంగా బలగాలు గత కొంత కాలంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలను బలగాలు కట్టడి చేయడంతో ఝార్ఖండ్, బీహర్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ముఖ్య నాయకులు షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు గమనించాయి. దీంతో ఇటీవల కాలంలో ఝార్ఖండ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు ఉన్నతాధికారులు.