ఏపీలో విస్తరిస్తున్నసేవలు…
దిశ దశ, హైదరాబాద్:
ఎయిర్ పోర్టుల సేవలు తెలంగాణ రాష్ట్రానికి విస్తరించే అవకాశం ఉందా..? గాలి మోటరెక్కేందుకు శంషాబాద్ వరకు వెళ్లక తప్పదా..? పొరుగు రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల సేవలు అందుబాటులోకి వస్తుంటే తెలంగాణాలో మాత్రం అడుగు ముందుకు పడినట్టుగా మాత్రం కనిపించడం లేదు.
ఏపీలో ఎన్నంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల వివరాలు తెలిస్తే తెలంగాణ వాసులు ముక్కున వేలేసుకోవల్సిందే. ఏపీలో కడప, కర్నూలు, పుట్టపర్తి, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో ఇప్పటికే ఎయిర్ పోర్టులు ఉండగా తాజగా ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామారాజు జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్ట్ సేవలందించేందుకు సిద్దమైంది. ఇవే కాకుండా ఏపీలోని మరిన్ని చోట్ల కూడా విమానాశ్రయాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు కాగా తాజాగా నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్టు కూడా ఇంటర్నేషనల్ సేవలు అందించనున్నట్టుగా తెలుస్తోంది.
ఒకే ఒక్కటి…
తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఒకే ఒక ఎయిర్ పోర్టు అందుబాటులో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాలన్న, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లాలన్నా ఒక్క శంషాబాద్ విమానశ్రయమే పెద్ద దిక్కుగా మారింది. ఇక్కడ సేవలు అందుబాటులోకి రాకముందు హైదరాబాద్ నగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ తరువాత నుండి ఇక్కడకు విమానాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన వారు విమానమెక్కాలంటే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిందే.
వరమా… శాపమా…
శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం బాధ్యతలు జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎయిర్ పోర్టు నిర్మాణ సమయంలో జరిగిన ఒప్పందమే తెలంగాణాకు శాపంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 150 కిలో మీటర్ల లోపల ప్రభుత్వం కొత్త విమనాశ్రయాలు నిర్మించరాదు. జీఎంఆర్ సంస్థతో కుదిరిన ట్రైపార్టీ అగ్రిమెంట్ క్లాజ్ 5.2ను సవరిస్తే తప్ప కొత్త ఎయిర్ పోర్టులు తెలంగాణలో నిర్మించుకునే అవకాశం అయితే లేదు. మరో వైపున హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్ కూడా తెలంగాణ వాసుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో ఉన్న ప్రాంతంలో విమానాశ్రయాలు నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసే అవకాశం లేదు.
ప్రతిపాదన దశలో…
అయితే ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నా కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. వరంగల్ మామ్నూరు ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ట్రై పార్టీ అగ్రిమెంట్ క్లాజ్ లో సడలింపుల కోసం ప్రయత్నించి సక్సెస్ అయింది. అయితే దీంతో మామ్నూర్ ఎయిర్ పోర్టు కు అవసరమైన భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా కెటాయించింది. ఇక్కడ రనే వే 2800 మీటర్ల పొడవు ఉండాలని అందుకు అనుగుణంగా భూ సేకరణ చేపట్టాల్సి ఉంటుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కెటాయించినప్పటికీ ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో అంతగా వేగం కనిపించడం లేదని సమాచారం. మరో వైపున పెద్దపల్లి జిల్లా రామగుండం వద్ద కూడా ఎయిర్ పోర్టు నిర్మాణం జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొదట ఈ ప్రాంతం ఐఏఎఫ్ పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ తరువాత సుముఖత వ్యక్తం చేస్తూ లేఖ రాసిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రకటించారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్టు కోసం 369 ఎకరాలు ఉండగా మొత్తం 1592 అవసరమని మిగతా భూ సేకరణ జరిపినట్టయితే విమానశ్రయ నిర్మాణం జరిపేందుకు సుముఖంగా ఉన్నామని కేంద్రం వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారినట్టుగా తెలుస్తోంది. నిధుల సమీకరణతో పాటు భూములను స్వాధీనం చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం జరపతలపెట్టిన ఎయిర్ పోర్టులు అన్ని కూడా దేశీయ విమానాల రాకపోకల కోసం వినయోగించుకోవడమే తప్ప ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు సాగించే అవకాశం అయితే లేదు.

