లంచం తీసుకుంటుండగా ట్రాప్
దిశ దశ, జగిత్యాల:
క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన ఏఈఈని బాధితుడు ఏసీబీకి పట్టించాడు. అవినీతికి పాల్పడిన ఇంజనీర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెలితే… జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఓ కాంట్రాక్టర్ నాలుగేళ్ల క్రితం వివిధ నిర్మాణాలు చేశారు. అప్పటి నుండి బిల్దులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాను పూర్తి చేసిన వర్క్స్ కు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ అందించాలని పంచాయతీ రాజ్ ఏఈఈ అనిల్ కుమార్ ను కోరాడు. రూ. 18 వేలు లంచం ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని ఏఈఈ చెప్పాడు. తాను అంతగా ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ అనిల్ ను వేడుకగా చివరకు రూ. 10 వేలు ఇవ్వాలని అడిగాడు. మొదట రూ. 3 వేలు ఏఈఈకి ముట్టజెప్పిన కాంట్రాక్టర్ మిగిలిన రూ. 7 వేలు చెల్లించేప్పుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న ఏఈఈ అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చిందని, ఏఈఈ అనిల్ ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.
మూడు రోజులుగా?
జగిత్యాల పంచాయతీ రాజ్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఏఈఈని పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సోమ, మంగళవారాల్లో అనిల్ డ్యూటీకి రాకపోవడంతో అతని కోసం ఎదురు చూసినట్లుగా తెలుస్తోంది. బుధవారం లంచం తీసుకుంటుండగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు.

