Telangana Acb: రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు… ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ కార్యాలయల్లో సోదాలు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించారు. గురువారం రాష్ట్రంలోని ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా సలాబత్ పూర్ ఆర్టీఏ చెక్ పోస్ట్, పెద్దపల్లితో పాటు మరిన్ని కార్యాలయాల్లో దాడులు చేపట్టారు. ఈ తనిఖీలలో రూ. 1,81, 030 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయా కార్యాలయాల్లో పలు అవినీతి అవకతవకలు చోటు చేసుకున్నాయని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరో వైపున ఖమ్మం ఉమ్మడి జిల్లా బూర్గుంపాడు, హన్మకొండ జిల్లా భీమదేవపరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.91 వేల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, పలు అవకతవకలను కూడా గుర్తించారు. ఆయా కార్యాలయాల్లో చేపట్టిన సోదాలకు సంబంధించిన సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

పెద్దపల్లిలో…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ACB DSP విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని DTO, MVI కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు అంశాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదు రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. DTO, MVI, AMVIలు, 12 మంది సిబ్బందితో పాటు పలువురు ఏజెంట్లు, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ఆరా తీసినట్టు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో రూ. 60,450 నగదును స్వాధీనం చేసుకున్నామని ఇందుకు సంబంధించిన నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు కృష్ణ కుమార్, తిరుపతి, పున్నం చందర్ ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

ఏజెంట్ల వ్యవస్థ రద్దయినా…

రవాణా శాఖలో ఆర్టీఏ ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసినప్పటికీ వీరి ప్రమేయం వెలుగులోకి రావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో ఏజెంట్లు, డ్రైవర్లు కార్యాలయంలోనే ప్రత్యక్ష్యం కావడంతో వారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను రాబట్టారు. ఏజెంట్ల వ్యవస్థ రద్దయినప్పటికీ వీరు ఎందుకు ఆఫీసు లోపల ఉన్నారు..? కార్యాలయాల్లో అసలు వీరి భాగస్వామ్యానికి కారణం ఏంటీ అన్న కోణంలో ఆరా తీసినట్టుగా తెలుస్తోంది, అలాగే అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తున్న ఇద్దరు కూడా రవాణా శాఖ కార్యాలయంలో కనిపించడంపై కూడా ఏసీబీ అధికారలు దృష్టి సారించారు. రవాణా శాఖతో సంబంధం లేని వ్యక్తులు దర్జాగా ఆఫీసుల్లో తిష్ట వేసి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారన్న విషయాన్ని గమనించిన ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నారు.