తూర్పు డివిజన్ లో ఏసీబీ దాడులు…

భూపాలపల్లి కోర్టులో ఉధ్యోగుల ట్రాప్…

మంథనిలో  రిజిస్ట్రార్...

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని తూర్పు డివిజన్ లో ఏసీబీ వేర్వేరుగా ఏసీబీ దాడులు జరిగాయి. కోర్టులో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులను, మంథని సబ్ రిజిస్ట్రార్ తో పాటు ప్రైవేటు డాక్యూమెంట్ రైటర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

భూపాలపల్లిలో…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టులో సర్టిఫైడ్ కాపీ కోసం లంచం డిమాండ్ చేసి తీసుకున్న ముగ్గురు ఉద్యోగులను వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. జిల్లాలోని ఘన్ పూర్ కు చెందిన రైతుకు కరకపల్లి శివార్లలో 14.02 గుంటల భూమి ఉండగా 1985 నుండి కోర్టులో వివాదం నడుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు కాపీ కోసం గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకోగా సర్టిఫైడ్ కాపీ కోసం స్టెనోగా పనిచేస్తున్న సాయి చరణ్ రూ. 20 వేల లంచం అడిగాడు. తాను అంతగా ఇచ్చుకోలేనని రైతు శ్రీచరణ్ ను అభ్యర్థించగా చివరకు రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో శుక్రవారం రూ. 5 వేలు చరణ్ కు ఇవ్వగా జిల్లా కోర్టులోని సంబంధిత విభాగంలో పనిచేస్తున్న పున్నం రజిత, కొమ్ము సునితలను కలవాలని సూచించాడు. ఆ తరువాత రజిత డబ్బులు తీసుకుని సర్టిఫైడ్ కాపీలు ఇవ్వగా చరణ్ తననే తీసుకోవాలని సూచించాడని సునిత కూడా ఆ లంచం డబ్బులు తీసుకున్నారు. దీంతో ముగ్గురు ఉద్యోగులను అరెస్ట్ చేశామని శనివారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు.

మంథనిలో…

పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పుట్టపాకకు చెందిన ఓ రైతుకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో సహకరించేందుకు ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్ రషీద్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ కె రాజేందర్ లంచం తీసుకున్నాడు. బాధితుని నుండి రూ. 16,500 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో మంథని సబ్ రిజిస్ట్రార్ రాజేందర్, రషీద్ లను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తున్నామని వెల్లడించారు.