Telangana Bjp: అక్కడ కేంద్ర మంత్రి టూర్… దూరంగా ఎంపీ క్యాడర్…

సోషల్ మీడియాలో ఆరోపణల వెల్లువ…

దిశ దశ, హుజురాబాద్:

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ టూర్ లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ క్యాడర్ కనిపించ లేదు. ఆయన పర్యటనకు దూరంగా కొంతమంది ఉండగా మరి కొంతమంది శామీర్ పేటకు వెల్లినట్టుగా తెలుస్తోంది.

వారం రోజులుగా…

గత వారం రోజులుగా హుజురాబాద్ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు రచ్చకెక్కినట్టుగా తెలుస్తోంది. 2021లో బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ వర్గీయులంతా కూడా ఒక వర్గంగా సీనియర్ బీజేపీ నాయకులు మరో వర్గంగా ఏర్పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. మల్కజ్ గిరి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ ను గత రెండు మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఆయా మండలాల శ్రేణులు శామీర్ పేటకు వెల్లి కలిసివస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా జమ్మికుంటకు చెందిన శ్రేణులు ఎంపీ ఈటలను కలిసేందుకు ప్రత్యేకంగా వెల్లినట్టుగా సమాచారం. ఈటల బీజేపీలో చేరిన తరువాత తమను పట్టించుకోవడం లేదన్న సీనియర్ బీజేపీ నాయకులు తమకు ప్రాతినిథ్యం దక్కుతుందని సంబరపడిపోతుండగా తమను పక్కన పెట్టారన్న ఆవేదన ఈటల వర్గంలో వ్యక్తం అవుతోంది.

‘బండి’’ పర్యటన…

కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం హుజురాబాద్ పట్టణంలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిసంచారు. ఈ కార్యక్రమానికి రావాలని తమకు ఆహ్వానం లేదని ఈటల వర్గీయులు కొంతమంది అంటుండగా, హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఈటల ఫోటో ఫ్లెక్సీలలో ముద్రించలేదని కూడా మరికొందరు వాదిస్తున్నారు. ఈ కారణంగానే తాము కేంద్ర మంత్రి పర్యటనకు దూరంగా ఉన్నామని అంటున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ వస్తున్న విషయం తెలిసి కావాలనే పార్టీలో విబేధాలు ఉన్నాయన్న సంకేతాలను ఈటల వర్గీయులు పంపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు. దీంతో కరీంనగర్ లోకసభ పరిధిలోని ఇద్దరు బీసీ అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ మొదలైనట్టుగా స్పష్టం అవుతోంది.

ఇటీవల…

ఇటీవల హుజురాబాద నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. అధికారిక కార్యక్రమాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తూ ముందుకు వెల్తానని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డిని పిలిచారని సంజయ్ అనుచరగణం అంటోంది. కౌశిక్ రెడ్డి, ఈటలకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందన్న అభిప్రాయం హుజురాబాద్ ప్రాంతంలో నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పాడి కౌశిక్ రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారన్న వాదనలు ఈటల వర్గీయుల్లో వక్యం అవుతున్నాయి. బండి సంజయ్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రయారిటీ ఇస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్ర అధ్యక్ష పదవి…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరిగింది. అధిష్టానం రాష్ట్ర నాయకులతో సమాలోచనలు జరిపి ఈటలకే పట్టం కడుతోందన్న విశ్వాసం ప్రదర్శించారు ఆయన వర్గీయులు. చివరి నిమిషంలో ఈటలను కాదని రామచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతలు అప్పగించడంతో ఆయన వర్గీయులు ఖంగుతిన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మొదటి నుండి పార్టీలో కొనసాగుతున్న వారికే ఇవ్వాలని సంఘ్ పరివార్ తేల్చి చెప్పడం వల్లే రామచందర్ రావును ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తుండగా, తెరవెనక మంత్రాంగం నెరిపిందంతా కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అని ఈటల వర్గీయులు ఆరోపిస్తున్నారు. బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న ఈ సమయంలో రాష్ట్రంలో చరిష్మా ఉన్న ఈటలను పక్కన పెట్టేందుకు కేంద్ర మంత్రి అండర్ గ్రౌండ్ వర్క్ చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. అదంతా వట్టిదేనని జాతీయ నాయకత్వం నిర్ణయానికి అనుగుణంగానే తనకు అధ్యక్ష్య బాధ్యతలు అప్పగించారని రామచందర్ రావు తేల్చి చెప్తున్నారు. అయినప్పటికీ బండి సంజయ్ కేంద్రీకృతంగానే ఆరోపణల పర్వం కొనసాగుతుండడం గమనార్హం. వారం పది రోజులుగా ఈటల వర్గీయులు ఆయనతో చర్చలు జరుపుతున్న క్రమంలో హుజురాబాద్ నుండి ప్రత్యేకంగా వెల్లి ఆయన్ను కలిసి వస్తుండడంతో హుజురాబాద్ బీజేపీలో వర్గపోరు రచ్చకెక్కినట్టయింది. ఇంతకాలం నిగుఢంగా సాగిన ఈ వ్యవహారం అంతా ఒక్కసారిగా బట్టబయలు కావడంతో స్థానికంగా సరికొత్త చర్చకు దారి తీసినట్టయింది.

సోషల్ మీడియా వేదికగా…

మరో వైపున హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు వాట్సప్ గ్రూపుల్లో ఈటలకు వ్యతిరేకంగా పోస్టుల పరంపర కొనసాగుతోంది. శామీర్ పేట కేంద్రంగా కుట్రలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ అవుతున్నాయి. ఈటల తన కుటుంబ సభ్యులను వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుండి పోటీ చేయించేందుకు పథకం పన్నారని, హుజురాబాద్ శ్రేణులను శామీర్ పేటకు పిలిపించుకుని ఈటల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవాలన్న ఆలోచనతో వ్యూహం పన్నారని కూడా అందులో ఆరోపించడం గమనార్హం.

హుజురాబాద్ ప్రాంతంలోని వాట్సప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న మ్యాటర్…

బీజేపీలో మళ్లీ మొదలైన ‘‘శామీర్ పేట’’ కుట్రలు

హుజూరాబాద్ కార్యకర్తలారా ఆ కుట్రలకు బలికాకండి…..

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులంతా గ్రూపులకు అతీతంగా ఉంటూ కలిసి మెలిసి ప్రశాంతంగా అభివ్రుద్ది, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీని బలోపేతం చేస్తూ మరికొద్దిరోజుల్లో జరగబోయే స్థానిక సంస్థలకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ‘‘శామీర్ పేట’’ కేంద్రంగా మళ్లీ కుట్రలు మొదలైనయ్. తన కుటుంబ సభ్యులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టిక్కెట్ ఇప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ నాయకుడు ‘శామీర్ పేట’ కేంద్రంగా మళ్లీ గ్రూపు రాజకీయాలను ప్రారంభించారు. మొన్నటికి మొన్న కమలాపూర్ కేంద్రంలోనూ గుప్పెడు మంది నాయకులు అసమ్మతి సమావేశం నిర్వహించుకునేలా చేసిన ‘సదరు నేత’ ఇప్పుడు నేరుగా హుజూరాబాద్ లోని తన అనుచరులను (ఇప్పుడు అనుచరుల సంఖ్య బాగా తగ్గిపోయిందనుకోండి) శామీర్ పేటకు పిలిపించుకుని మంతనాలు జరుపుతున్నారు.
తనతోపాటు తన భార్యకు కూడా వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఇవ్వాలని అడిగితే అధిష్టానం కత్తెర వేస్తుందని తెలుసుకున్న సదరు నాయకుడు హుజూరాబాద్ లోని నాయకుల నుండే ఈ ప్రతిపాదన వచ్చేలా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. శామీర్ పేట ఆదేశాలతో త్వరలో 50 నుండి 60 కార్లతో ర్యాలీగా వెళ్లి నేరుగా సదరు నేతను కలిసి ‘‘హుజూరాబాద్’’ నుండి మీరు లేదా మీ కుటుంబ సభ్యులే పోటీ చేయాలని ప్రతిపాదించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు హుజూరాబాద్ నియోజవర్గంలో తన అనుచరులకు ఈ మేరకు సంకేతాలు కూడా పంపారు. ఇట్లాంటి కుట్రలతో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో క్యాడర్ అయోమయంలో పడిపోయింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నేను చెప్పేదేమిటంటే….శామీర్ పేట కుట్రలకు అడ్డా. సదరు నేత మేకవన్నెపులి. ఆదరించి ఆదుకున్న వారినే అథ:పాతాళానికి తొక్కడం ఆయన నైజం. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లనే కుట్రలు చేసిండు. అనేకసార్లు ఎమ్మెల్యే టిక్కెట్లివ్వడమే కాకుండా, మంత్రి పదవిసహా పార్టీలో ఉన్నత పదవులిచ్చి అక్కున చేర్చుకుని ఆదరించిన కేసీఆర్ కు వ్యతిరేకంగా అసమ్మతి సమావేశాలు నిర్వహించి సీఎం అయ్యేందుకు ప్లాన్ చేసిండు. విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆయనను పార్టీ నుండి బహిష్కరించిండు. అవినీతి, భూభాగోతాల చిట్టాను బయటకు తీసి కేసులు పెట్టి జైలుకు పంపేందుకు సిద్ధమైండు.
ఎవరూ దిక్కులేక ఒంటరైన సదరు నేత బీజేపీ జాతీయ నాయకత్వం వద్దకు పోయి శరణు కోరితే పార్టీలోకి తీసుకుని ఆదరించింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వెంట ఉన్న అనుచరులు, నాయకులంతా సదరు నేత నైజం తెలిసి దూరమైతే… ఏకాకిలా మారి దిక్కులు చూస్తుంటే మళ్లీ బీజేపీ నాయకత్వమే అండగా నిలిచింది. దేశంలో ఏ ఎన్నికల్లోనూ ఏ అభ్యర్ధికి చేయనంత ఆర్ధిక సాయాన్ని సదరు నేతకు అందించింది. ఏకంగా 3 వేల మంది కార్యకర్తలను, సంఘ్ పరివార్ ను ఎన్నికల రంగంలోకి దింపి ఇంటింటికీ ప్రచారం చేసి గెలిపించింది. 30, 40 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కూడా దక్కనన్ని పదవులను సైతం సదరు నాయకుడికి బీజేపీ జాతీయ నాయకత్వం కట్టబెట్టింది. రాజకీయ జీవితమే ఖతమై జైలుకు పోవాల్సిన తరుణంలో ఎవరైనా సరే అండగా ఉండి ఆదుకుని ఉన్నత పదవులిస్తే అట్లాంటి వాళ్లను మనం నెత్తిన పెట్టుకుంటాం. రుణపడి ఉంటాం. వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాం. ఇది మానవ నైజం. కానీ సదరు నేత తీరు అందుకు పూర్తి భిన్నం. గెలిచిన వెంటనే ఏబీఎన్ ఛానల్ లో రాధాక్రిష్ణ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘హుజూరాబాద్ లో బీజేపీ ఎక్కడుంది? నేను బీజేపీ నుండి పోటీ చేయడంవల్లే ఇంత తక్కువ మెజారిటీ వచ్చింది. అదే ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్లయితే ఇంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చేది’’అని తన గుంట నక్క నైజాన్ని బయటపెట్టేసిండు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ రోజురోజుకూ బలోపేతమై బీఆగర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయంగా మారిన తరుణంలో… సదరు శామీర్ పేట క్యాంపు ఎంటరై గ్రూపు రాజకీయాలు చేస్తూ బండి సంజయ్ పై లేనిపోని నిందలు మోపి కుట్రలు చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి దించేలా చేసి బీజేపీని సర్వనాశనం చేసిన సంగతిని మర్చిపోగలమా? ఏళ్ల తరబడి కార్యకర్తలు, నాయకులు చేసిన పోరాటాలను బూడిదలో పోసిన పన్నీరులా మార్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలో రాకుండా సైంధవ పాత్రను పోషించిన విషయాన్ని ఎట్లా మర్చిపోగలం?
అన్నీ దిగమింగుకుంటూ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి బండి సంజయ్ ను బంపర్ మెజారిటీతో గెలిపించుకున్నం. హుజూరాబాద్ అసెంబ్లీ పరిధిలో సదరు నేత కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు సాధించినం. గ్రూపులకు అతీతంగా అందరూ కలిసి ఐక్యంగా పనిచేస్తూ హుజూరాబాద్ అభివ్రుద్ధికి పాటుపడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నం. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ బీజేపీని గెలిపించిన కార్యకర్తలను, నాయకులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకునేందుకు బండి సంజయ్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నడు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులందరికీ అందుబాటులో ఉంటూ పిలిస్తే పలుకుతున్నడు. నేను ఈ మధ్య బండి సంజయ్ ను కలిసి మా గ్రామ అభివ్రుద్ది గురించి ప్రస్తావించగానే ఎంపీ లాడ్స్ నిధులిచ్చిండు. రోడ్లు వేసేందుకు జాతీయ ఉఫాధి హామీ నిధులు మంజూరు చేయించిండు. కుల సంఘాలకు ఆర్ధిక సాయం చేసిండు. నా ఒక్కడికే కాదు, ఏ బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లినా ఇదే విధంగా సాయం చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ ను అభివ్రుద్ధి చేస్తున్నడు. బీజేపీని బలోపేతం చేస్తున్నడు. ఇది చూసి ఓర్వలేని ‘శామీర్ పేట క్యాంపు’’ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ కార్యకర్తల్లో గందరగోళం స్రుష్టిస్తూ పార్టీని దెబ్బతీసే కుట్రలకు తెరదీస్తోంది. గత ఎన్నికల నుండి మొదలు మొన్నటి వరకు ‘‘కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నేనే. నాకే అధ్యక్ష పదవి ఖాయమైంది. ఇదిగో ముహూర్తం…అదిగో ముహూర్తం’’అంటూ జి.కిషన్ రెడ్డి అన్నను ఏడాదిపాటు పనిచేయకుండా ఇబ్బంది పెట్టిండు. అదే సమయంలో నేను అధ్యక్షుడయ్యాక ఈసారి నాకు సహకరించని వాళ్ల సంగతి చూస్తానంటూ గ్రూపు రాజకీయాలు చేస్తూ క్యాడర్ ను, లీడర్లను భయపెట్టుకుంటూ పబ్బం గడుపుకున్నడు.
ఒకవైపు బండి సంజయ్ ‘‘బీజేపీలో గ్రూపుల్లేవ్. ఉన్నది ఒకటే గ్రూపు. అదే మోదీ గ్రూపు. అట్లా కాకుండా సొంతంగా గ్రూపులు కడితే టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే నాది బండి సంజయ్ గ్రూపు అని చెప్పుకునే వాళ్లకు కూడా టిక్కెట్లు రాకుండా చేస్తా’’అని కరాఖండిగా చెబుతుంటే…. సదరు శామీర్ పేట క్యాంపు మాత్రం తన గుంట నక్క నైజాన్ని బయటపెడుతూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ నాయకులు, కార్యకర్తల్లో అయోమయం స్రుష్టిస్తున్నడు.
హుజూరాబాద్ నాయకులు, కార్యకర్తలారా….మీరు అయోమయానికి గురి కావొద్దు. అటు ఇటుగా ఉంటూ మీ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. భారతీయ జనతా పార్టీలో భర్తకు, భార్యకు, పిల్లలకు టిక్కెట్లు ఇవ్వరు. ఎందుకంటే బీజేపీ కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వాళ్లకే టిక్కెట్లు వస్తాయి. శామీర్ పేట క్యాంపు కుట్రలకు బలికావొద్దు. పొరపాటున శామీర్ పేట క్యాంపులో చేరితే మీ రాజకీయ భవిష్యత్తును మీరే చేజేతులా నాశనం చేసుకున్న వాళ్లవుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. బీజేపీలో మనందరిదీ ఒకటే గ్రూపు..అదే మోదీ గ్రూప్. కలిసికట్టుగా ముందుకు సాగుదాం… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నుండి మెజారిటీ స్థానాల్లో బీజేపీని గెలిపించుకుని కాషాయ కార్యకర్తల సత్తాను చాటుదాం.
జై శ్రీరాం…
మీ….
కృపాకర్,
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్త.