Kaleshwram గంగమ్మ ఒడిలో జంగమయ్యకు పూజలు…

నాలుగో రోజూ సరస్వతి పుష్కరాలు…

కొనసాగుతున్న భక్తుల వరద

దిశ దశ, కాళేశ్వరం:

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం.

త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సరస్వతి పుష్కరాల్లో నాలుగో రోజైన ఆదివారం లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్త జనం కాళేశ్వరం క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం ట్రాఫిక్ జామ్ కావడంతో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీంతో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల రాకపోకలు సాగాయి.

సైకత లింగాలు…

సరస్వతి అంతర్వాహిని నది పుష్కరాలను పురస్కరించుకని భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం గంగమ్మ ఒడిలో జంగమయ్యను ఆరాధిస్తున్నారు. సైకత లింగాలను తయారు చేసుకున్న భక్తులు శివ నామస్మరణలో చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. నది తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించిన తరువాత నదీ తీరంలోనే సైకత లింగాలను తయారు చేసి శివుడిని ప్రత్యేకంగా పూజించే ఆనవాయితీని పాటిస్తారు. అనంతరం త్రివేణి సంగమాన్ని పూజించి దీపారాధన చేసి గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. ఆ తరువాత శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి, శుభానంద దేవి, సరస్వతి మాత ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఆధ్యాత్మికతతో ఉట్టిపడుతున్న త్రివేణి సంగమ తీరం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది.

మొంటెల వాయినం…

పుష్కరుడు సంచరించే వేళ ముత్తయిదలు మొంటెల వాయినం మొక్కులు తీర్చుకుంటున్నారు. సుభాషిణీలకు సాంప్రాదాయ బద్దమైన ఆచారంలో భాగంగా మొంటెల వాయినాలు ఇస్తూ దీర్ఘ సుమంగలిగా ఉండేలా దీవెనలు అందుకుంటున్నారు.

ఏరియల్ సర్వే…

త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలిక్యాప్టర్ లో గగనంలో సంచరిస్తూ నది తీరంతో పాటు ఆయా ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు.

You cannot copy content of this page