ACB: ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ. 96 కోట్లు…

ఏసీబీ దాడులతో బట్టబయలు…

దిశ దశ, హైదరాబాద్:

ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అవినీతి తిమింగలాలపై తెలంగాణ ఏసీబీ కొరడా ఝులిపించింది. ఓ వైపున లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హైండెడ్ గా పట్టుకుంటూనే మరో వైపున అక్రమ ఆదాయం గడించిన ప్రభుత్వ యంత్రాంగంపై దాడులు చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలను డీజీ చారు సిన్హా వెల్లడించారు.

ఆదాయానికి మించి…

వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ అక్రమంగా సంపాదిస్తున్న అధికార యంత్రాంగాన్ని పట్టుకోవడంలో ఈ ఏడాది ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులు కేవలం 15 మాత్రమే నమోదు చేయగా వారి వద్ద రూ. 96,13,50,554 విలువైన ప్రాపర్టీస్ గుర్తించింది తెలంగాణ ఏసీబీ. రూ. 96 కోట్ల విలువ రిజిస్ట్రేషన్ వాల్యూయేషన్ ప్రకారం ఏసీబి అధికారులు అధికారికంగా వెల్లడించాయి. బహిరంగ మార్కెట్ లో వీటి వందలాది కోట్లపైగానే ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. 15 మందిపై ఏసీబీ దృష్టి సారిస్తేనే ఈ స్థాయిలో అక్రమ ఆదాయం ఉన్నట్టు లెక్క తేల్చారంటే మిగిలిన అక్రమార్కుల భరతం పడితే అవినీతి ఏ స్థాయిలో బయటపడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ట్రాప్ కేసులు…

ఈ ఏడాది ఏసీబీ ట్రాప్ కేసుల విషయంలో దూకుడు ప్రదర్శించింది. బాధితులు ఆశ్రయించిన వెంటనే సమగ్ర వివరాలు సేకరించి బాధితులకు జరిగిన అన్యాయం. ఇందుకు సంబంధించిన ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించిన తరువాత లంచం తీసుకుంటున్న వారిని ట్రాప్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్న కేసులు రాష్ట్రంలో ఈ ఏడాది 158 నమోదు కాగా మొత్తం 224 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా మిగతా వారంతా లంచం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో దళారులుగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ట్రాప్ కేసుల్లో రూ. 57, 17,500 నగదు స్వాధీనం చేసుకోగా రూ. 35,89,500 నగదును ఫిర్యాదు దారులకు తిరిగి చెల్లించింది. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా వారికి దళారులుగా వ్యవహరించిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే సాంప్రాదాయం కొంతకాలంగా తెలంగాణలో ప్రారంభం అయింది. దీంతో మిడియేటర్ గా వ్యవహరించడం కూడా చట్టపరంగా నేరమేనని ఏసీబీ అధికారులు తేటతెల్లం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి 26 విచారణలు జరపగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీఏ చెక్ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయల్లో మొత్తం 54 ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న 115 మందిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని చార్జీ షీట్స్ వేసింది.