గడువు కోరాడు… వనం వీడాడు…

బాహ్య ప్రపంచంలోకి వచ్చిన అనంత్ బృందం

దిశ దశ, దండకారణ్యం:

జనవరి 1 వరకు సమయం ఇవ్వండి… వనం వీడి జనాల్లోకి వస్తాం… అంటూ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థించిన మావోయిస్టు నేత అనూహ్యంగా పోలీసుల ముందు ప్రత్యక్ష్యం అయ్యాడు. మహారాష్ట్రలోని నాగపూర్ లోని గడ్చిరోలి డీఐజీ క్యాంపు ఆఫీసులో జన జీవనంలో కలుస్తున్నట్టుగా ప్రకటించాడు.

MMC నేత…

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ జోనల్ కమిటీ సభ్యుడు వికాస్ నాగపూరే అలియాస్ నవజ్యోత్, అనంత్ అలియాస్ వినోద్ భాస్కర్ రామస్వామితో పాటు 11 మంది మావోయిస్టులు శుక్రవారం రాత్రి జనజీవనంలో కలిశారు. ఆయనతో పాటు మరో 10 మంది మావోయిస్టులు ఆయుధాలను కూడా గడ్చిరోలీ డీఐజీ అంకిత్ గోయల్ కు అప్పగించారు. వీరిలో ఏరియా కమిటీ సభ్యులు, టెక్నికల్ టీమ్ సభ్యులు ఉన్నారు. అయితే తమకు జనవరి ఒకటి వరకు గడువు ఇవ్వాలని అప్పటి వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరుతూ ఇటీవలే అనంత్ ఆడియోతో పాటు ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం నడుచుకుంటామని డిసెంబర్ 2 నుండి నిర్వహించబోయే PLGA వారోత్సవాలకు కూడా దూరంగా ఉంటామని ప్రకటించారు. జనజీవనంలో కలిసేందుకు వచ్చే మావోయిస్టులు తనకు బావోఫెంగ్ ఫ్రీక్వెన్సీ ద్వారా కాంటాక్టు కావాలని ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి 11.15 నిమిషాల వరకు తనతో నేరుగా మాట్లాడవచ్చని కూడా పిలుపునిచ్చారు. ఆయన ప్రకటన వెలుగులోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే గడ్చిరోలీ డీఐజీ ముందు లొంగిపోవడం గమనార్హం.